శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 13 & 14


*శ్రీమద్రామాయణం*

*అరణ్యకాండ – 13*

*[ప్రీతో అస్మి తే మహత్ కర్మ త్వయా కృతం ఇదం ప్రభో |*
*ప్రదేయో యన్ నిమిత్తం తే పరిష్వంగో మయా కృతః ||]*

ఆ పర్ణశాలని చూసిన రాముడు “ఏమీ పని చేశావయ్యా లక్ష్మణా! నువ్వు చేసిన ఈ పనికి నేను నీకు ఏమి ఇవ్వగలను? నేను ఇవ్వగలిగిన కానుక ఏమిటో తెలుసా?” అని లక్ష్మణుడిని రాముడు గట్టిగా కౌగలించుకుని “లక్ష్మణా! నువ్వు నాతో భావము చేత, కృతజ్ఞత చేత, ధర్మము చేత నాకు తమ్ముడివి కాదయ్యా! నువ్వు నాకు తండ్రివి. దశరథమహారాజు గారు వెళ్ళిపోలేదు. నీ రూపంలో నా దగ్గరే ఉన్నారు. నేను ఎంత అదృష్టవంతుడిని” అన్నాడు. అలా వారు ఆ పంచవటిలో రోజూ చెయ్యవలసిన కార్యములను చక్కగా చేసుకుంటూ, వచ్చిన ఋషులతో భగవత్ సంబంధమైన విషయముల మీద చర్చిస్తూ, తెచ్చుకున్న కందమూలాలను తింటూ చాలా సంతోషంగా కాలం గడపసాగారు. కొంతకాలానికి హేమంత ఋతువు వచ్చింది. ఒకరోజు రాముడు ఉదయాన్నే నదిలో స్నానం చెయ్యడానికి బయలుదేరాడు. రాముడి వెనకాల సీతమ్మ, లక్ష్మణుడు వెళ్ళారు. నదిలో స్నానం చేస్తున్న రాముడితో లక్ష్మణుడు “అన్నయ్యా! నీకు చాలా ఇష్టమైన కాలం వచ్చింది. ఈ కాలంలో మంచు బాగా పడుతుంది. ఈ ఋతువులో జనాలందరికీ నీటిని చూస్తే స్నానాదులు చెయ్యడానికి భయమేస్తుంది. సూర్యుడిని చూస్తే ఆనందిస్తారు. అసలు నీటిని చూస్తేనే ఒళ్ళు గడ్డ కట్టేస్తుంది.

ఈ ఋతువులో పంటలు ఇంటికి చేరుతాయి. కనుక అందరూ తమ పితృదేవతలకి పూజలు చేస్తారు. ఈ సమయంలో పశువులు పాలు బాగా ఇస్తాయి. పాడిపంట చేతికి రావడంతో పల్లెల్లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడున్నటువంటి జలపక్షులు నీటిలోకి వెళ్ళకుండా, ఒడ్డున కూర్చొని, ముఖాన్ని రెక్కలలో పెట్టుకొని కూర్చున్నాయి. వీటిని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే, ఉత్తమ క్షత్రియవంశంలో పుట్టి, ప్రగల్భాలు పలికి, యుద్ధంరంగం వైపు చూసి, యుద్ధానికి వెళ్ళకుండా పిరికివాడిలా బయట కూర్చున్నట్టు ఉన్నాయి ఈ పక్షులు. అన్నయ్యా! నాకు ఒక విషయం ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది, అదేమిటే సాధారణంగా మనుషులకి తల్లి పోలికలు ఎక్కువగా వస్తాయి. మృగాలకి తండ్రి పోలికలు ఎక్కువగా వస్తాయి. దశరథుడు ధర్మాత్ముడు, భరతుడు చాలా మంచివాడు. భరతుడు కూడా నీలాగే ఇప్పుడు నదిలో స్నానం చేస్తుంటాడు. మరి కైకేయ దుష్టబుద్ధి కలిగినది కదా! ఆవిడ పోలికలు భరతుడికి రాలేదేమిటి” అన్నాడు.

దానికి రాముడు “లక్ష్మణా! నువ్వు ఇప్పటిదాకా భరతుడి గురించి మాట్లాడావు. నా మనస్సు ఎంత సంతోషపడిందో తెలుసా! మధ్యలో కైకమ్మని జ్ఞాపకం తెచ్చుకొని ఎందుకు నిందిస్తుంటావు. అమ్మని అలా నిందించడం తప్పు. ఇంకెప్పుడూ అలా మాట్లాడకు. భరతుడి గురించి మాట్లాడు నేను పరమ సంతోషిస్తాను. భరతుడిని విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నాను. చిత్రకూటపర్వతం మీద భరతుడు నాతో మాట్లాడిన మాటలే నాకు గుర్తొస్తున్నాయి. అయోధ్యకి వెళ్ళి భరతుడిని చూసి రావాలని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది” అని అన్నాడు.

*శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 13 – సంపూర్ణం*

*శ్రీమద్రామాయణం*

*అరణ్యకాండ – 14*

*[కృతాభిషేకః స రరాజ రామః సీతా ద్వితీయః సహ లక్ష్మణేన |*
*కృత అభిషేకో తు గిరి రాజ పుత్ర్యా రుద్రః స నందిః భగవాన్ ఇవ ఈశః ||]*

సీతారామలక్ష్మణులు ముగ్గురూ స్నానం చేసి తడి బట్టలతో నిలబడితే, వారు అటుగా వెళ్ళే వాళ్ళకి ఇప్పుడే స్నానం చేసి బయటకి వచ్చిన నందికేశ్వర సహిత పార్వతీపరమేశ్వరులులాగ కనబడుతున్నారు – అని వాల్మీకి మహర్షి చెప్పారు. అలా కొంత కాలం గడిచాక, భగవంతుడి నిర్ణయం మేర అక్కడికి ఒక రాక్షసి వచ్చింది. ఆమె పేరు శూర్పణఖ. శూర్పణఖ అంటే చేటలంత గోళ్ళు ఉన్నది అని అర్థం. అప్పుడామె మదించిన ఏనుగు నడిచినట్టు నడిచేవాడు, విచ్చుకున్న పద్మముల వంటి కన్నులు ఉన్నవాడు, అపారమైన తేజస్సున్నవాడు, మన్మధుని సౌందర్యమును గెలవగలిగిన అందమున్నవాడు అయిన రాముడిని చూసింది. అప్పుడామెకి విశేషమైన కామం కలిగింది. రాముడిని చూస్తే ‘అబ్బ ఎంత బావున్నాడో’ అంటారు. ఆమెని చూస్తే ‘బాబోయి అలా ఉందేమిటి’ అంటారు. రాముడి కడుపు బయటకి కనపడకుండా లోపలికి ఉంటుంది. ఈమె బాన బోర్లించినట్టు పెద్ద పొట్టతో ఉంటుంది. రాముడివి పెద్ద కళ్ళు, ఈమెని వికృతమైన కళ్ళు. అందమైన జుట్టు రాముడిది. ఎర్రటి తీగలలాగ ఉన్న జుట్టు శూర్పణఖది. చూడగానే మళ్ళీ చూడాలనిపించే రూపం రాముడిది. పిల్లలు దడుచుకునే రూపం ఆమెది. రాముడిది మంచి కంఠం. ఈమె మాట్లాడితే కుక్క మొరిగినట్టు ఉంటుంది. రాముడు మంచి యవ్వనంలో ఉన్నాడు. ఈమె ముసలితనంలో ఉంది. రాముడు ఎప్పుడూ న్యాయంగా ప్రవర్తిస్తాడు. ఈమెది ఎప్పుడూ దుష్ట ప్రవర్తన. రాముడు ఎవరినన్నా ఒకసారి చూస్తే, వారు సంతోషపడతారు. ఈమె ఎవరినన్నా చూస్తే, వారు భయపడతారు. ఇటువంటి శూర్పణఖ రాముడి వంక చూసి “నువ్వు ఇంత అందంగా ఉన్నావు. జటామండలం కట్టుకున్నావు. నీలాగే ఇంకొక పురుషుడు కూడా కనబడుతున్నాడు. కానీ ఇక్కడ ఎవత్తో అందవికారంగా ఒక స్త్రీ కనబడుతోంది. ఇంతకీ మీరు ఎవరు?” అని అడిగింది.

అబద్ధం చెప్పడం రాని, తనని కోరి వచ్చింది కదా అని లేనిపోనీ మాటలు స్త్రీల వద్ద మాట్లాడడం ఇష్టపడని రాముడు ఇలా అన్నాడు “నేను దశరథ మహారాజు పెద్ద కొడుకుని. నన్ను రాముడు అంటారు. అతను నా తమ్ముడు లక్ష్మణుడు. ఆమె నా భార్య సీత. మేము ముగ్గురమూ తండ్రిగారి మాటకి కట్టుబడి అరణ్యాలకి వచ్చాము. ఇక్కడ తాపసులమై, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాము. నువ్వు ఎవరు?” అని రాముడు అన్నాడు.

*[అహం శూర్పణఖా నామ రాక్షసీ కామరూపిణీ |*
*అరణ్యం విచరామి ఇదం ఏకా సర్వ భయంకరా ||]*

*[రావణో నామ మే భ్రాతా యది తే శ్రోత్రం ఆగతః |*
*వీరో విశ్రవసః పుత్రో యది తే శ్రోత్రం ఆగతః ||]*

*శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 14 – సంపూర్ణం*

Leave a comment