శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 45 & 46 పరిసమాప్తం


*శ్రీమద్రామాయణం*

*అరణ్యకాండ – 45*

రామలక్ష్మణులు కబంధుడి శరీరాన్ని చితి మీద పెట్టి కాల్చేశారు. అప్పుడు ఆ చితి నుండి ఆభరణములు ధరించి, మంచి తేజస్సుతో, ఒక దివ్య శరీరంతో ధనువు పైకి వచ్చి “రామా! ఇప్పుడు నీకు చాలా కష్టమైన కాలం నడుస్తోంది. నీలాగే భార్యని పోగొట్టుకుని బాధపడుతున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయన కూడా ధర్మాత్ముడు. ఆయన పేరు సుగ్రీవుడు. నలుగురు వానరములతో కలిసి ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు. ఆయనని, ఆయన అన్నగారైన వాలి రాజ్యం నుండి వెడలగొట్టాడు. ఋక్షరజస్సు అనే వానరుని భార్యకి సూర్యుడి తేజస్సు వల్ల సుగ్రీవుడు ఔరస పుత్రుడిగా జన్మించాడు. నువ్వు ఆయనతో అగ్నిసాక్షిగా స్నేహం చేసుకో. వానరుడు కదా అని ఎన్నడూ సుగ్రీవుడిని అవమానించద్దు. ఇప్పుడు నీకు ఒక గొప్ప మిత్రుడు కావాలి. సుగ్రీవుడు నీకు తగిన మిత్రుడు.”

“ఆ సుగ్రీవుడిని కలుసుకోవడానికి నువ్వు ఇక్కడినుంచి పశ్చిమ దిక్కుకి వెళ్ళు. అక్కడ అనేకమైన వృక్ష సమూహములు కనపడతాయి. ఆ వృక్షములకు ఉండే పళ్ళు సామాన్యమైనవి కావు. అవి చాలా మధురంగా ఉంటాయి. మీరు ఆ పళ్ళు తిని ముందుకి వెళితే కొన్ని వనాలు వస్తాయి. మీరు ఆ వనాలన్నీ దాటి ముందుకి వెళితే ఆఖరికి పంపా అనే పద్మ సరస్సు వస్తుంది. ఆ సరస్సు వద్ద హంసలు, ప్లవములు, క్రౌంచములు, కురరవములు అనే పక్షులు నేతిముద్దల్లా ఉంటాయి. అలాగే ఆ సరస్సులో రుచికరమైన చేపలు ఉంటాయి. ఆ పక్షుల మాంసం, ఈ చేపల మాసం కూడా తినండి. తరువాత సుగంధ భరితమై, నిర్మలమై, చల్లగా ఉండేటటు వంటి ఆ సరస్సులోని నీటిని త్రాగండి. మీరు సాయంత్రం పూట అక్కడ విహరించండి. అప్పుడు మీకొక విచిత్రమైన విషయం కనపడుతుంది. అక్కడ వాడని పూలదండలు పడి ఉంటాయి. ఆ పూలదండలని ఎవరూ వేసుకోరు. ఇక్కడికి ఈ పూలదండలు ఎలా వచ్చాయో తెలుసా రామా!

పూర్వం మతంగ మహర్షి ఉన్నప్పుడు, ఆయన శిష్యులు ఆయనకి కావలసిన దర్భలు, ఇతర పదార్ధాలు అరణ్యమునుండి మూట కట్టి తీసుకెళ్ళేవారు. వారు అలా తీసుకెళుతున్నప్పుడు వారి ఒంటికి చెమట పట్టి, ఆ చెమట బిందువులు భూమి మీద పడ్డాయి. వారు ఎంతగా గురు సుశ్రూష చేసినవారంటే, వాళ్ళ చెమట బిందువులు భూమి మీద పడగానే పూలదండలుగా మారిపోయాయి. ఆ పూల దండలు ఇప్పటికీ వాడకుండా అలానే ఉన్నాయి. నువ్వు ఆ పూలదండలని చూసి సంతోషించు. ఆ పంపా సరోవరానికి ముందే ఋష్యమూక పర్వతం కనపడుతుంది.

ఆ ఋష్యమూక పర్వతాన్ని పూర్వకాలంలో బ్రహ్మగారు నిర్మించారు. దానిని ఎక్కడం చాలా కష్టం. చిత్రమేమిటంటే, ఆ పర్వతాన్ని గున్న ఏనుగులు రక్షిస్తూ ఉంటాయి. ఆ గున్న ఏనుగులు రోజూ పంపా సరోవరం దగ్గరికి గుంపులుగా వచ్చి నీళ్ళు తాగుతాయి. అవి ‘స్నేహితులు చెయ్యి చెయ్యి కలుపుకొని వెళ్ళినట్టు’, తొండాలు తొండాలు ముడివేసుకొని ఆ ఋష్యమూక పర్వతం చుట్టూ తిరుగుతాయి. ఆ ఋష్యమూక పర్వత శిఖరం మీద ఎవడన్నా ఒక రాత్రి పడుకుంటే, ఆ రాత్రి వారికి కలలో ఏది కనపడుతుందో, ఉదయానికల్లా అది జరిగి తీరుతుంది. పాపకర్మ ఉన్నవాడు, దుష్టబుద్ధి ఉన్నవాడు ఆ పర్వతాన్ని ఎక్కలేడు. ఆ పర్వతాల మీద 5 వానరాలు ఉన్నాయి. ఆ పర్వతం మీదకి వెళితే ఒక పెద్ద గుహ ఉంటుంది. దానిని ఒక రాతి పలకతో మూసి ఉంచుతారు. ఆ గుహలోకి ఎవరూ ప్రవేశించలేరు. దాని పక్కనే ఒక పెద్ద తోట ఉంటుంది. అందులో అన్ని ఫలాలు లభిస్తాయి. ఆ ఫలాలని తింటూ, అక్కడే ఉన్న సరస్సులోని నీళ్ళు తాగుతూ సుగ్రీవుడు ఆ గుహలో కూర్చొని ఉంటాడు.

ఆ సుగ్రీవుడు అప్పుడప్పుడూ గుహ నుండి బయటకి వచ్చి, ఆ పర్వత శిఖరాల మీద ఒక పెద్ద బండరాయి మీద కూర్చుంటూ ఉంటాడు. గుర్తుపెట్టుకో రామా! ఆ సుగ్రీవుడికి సూర్యకిరణాలు ఎంత దూరం వరకూ భూమి మీద పడతాయో, అంతవరకు ఏ పర్వతాలు ఉన్నాయో, ఎన్ని గుహలు ఉన్నాయో, ఆ గుహలలో ఎవరు ఉంటారో, ఎవరు ఎక్కడ ఉంటారో, ఎక్కడ పాలిస్తారో, వారి వంశం ఏమిటో అన్నీ తెలుసు. అందుకని అటువంటి సుగ్రీవుడితో స్నేహం చెయ్యి” అని చెప్పి వెళ్ళిపోయాడు.

*శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 45 – సంపూర్ణం*

*శ్రీమద్రామాయణం*

*అరణ్యకాండ – 46*

రామలక్ష్మణులు అక్కడినుండి బయలుదేరి మతంగ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు మతంగ మహర్షి యొక్క శిష్యురాలైన శబరి, రామలక్ష్మణులను చూసి గబగబా బయటకి వచ్చి వారి పాదాలని గట్టిగా పట్టుకుంది. వారికి అర్ఘ్యము, పాద్యము మొదలైనటువంటి అతిథికి ఇవ్వవలసిన సమస్త సంభారములు చేకూర్చింది. అవన్నీ స్వీకరించాక, రాముడు శబరితో “నువ్వు నియమంగా జీవితం గడపగలుగుతున్నావా? నియమముతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నావా? నియమముతో కూడిన తపస్సు చెయ్యగలుగు తున్నావా? నీ గురువుల యొక్క అనుగ్రహాన్ని నిలబెట్టుకుంటున్నావా?” అని అడిగాడు.

అప్పుడా శబరి “రామా! ఏనాడు నీ దర్శనం చేశానో, ఆనాడే నా తపస్సు సిద్ధించింది. నేను కూడా మా గురువుగారైన మతంగ మహర్షి శిష్యులతో పాటు తపస్సు చేశాను. నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉండగా మా గురువులందరూ దివ్యమైన విమానములు ఎక్కి ఉత్తమలోకాలకి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోతూ నాతో ఒక మాట అన్నారు “మహానుభావుడైన శ్రీరామచంద్రమూర్తి ఈ ఆశ్రమం వైపుకి వస్తారు. అప్పుడు వాళ్ళకి ఆతిధ్యం ఇచ్చాక నువ్వు కూడా మేము ఉన్నటువంటి ప్రదేశానికి వద్దువు” అని చెప్పి వెళ్ళారు. అందుకని నీకోసం నేను ఇక్కడే ఉండిపోయాను” అని చెప్పింది. అప్పుడా రాముడు శబరితో “నీ యొక్క ప్రభావాన్ని నేను చూడాలి అనుకుంటున్నాను శబరి” అన్నాడు.

అప్పుడు శబరి రాముడిని ఆ ఆశ్రమం లోపలికి తీసుకువెళ్ళి ఒక అగ్నివేదిని చూపించి “రామా! మా గురువుగారు ఈ అగ్నివేది దగ్గరే అగ్నిహోత్రం చేసేవారు. వృద్ధులైన మా గురువులు వొణికిపోతున్న చేతులతో పువ్వులు తీసి ఆ వేది మీద పెట్టేవారు. రామా! ఒక్కసారి ఆ వేది మీద చూడు. ఆ పువ్వులు ఇప్పటికీ వాడకుండా అలానే ఉన్నాయి. నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు వారు ఇక్కడ అగ్నికార్యం చేసి వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఆ అగ్నివేదిలో నుంచి వచ్చే కాంతి దశదిశలని ప్రకాశింప చేస్తుంది. మా గురువులు చాలా వృద్ధులు అవ్వడం వలన నదీ తీరానికి వెళ్ళి స్నానం చెయ్యలేకపోయేవారు. అందుకని వారు అక్కడే కూర్చొని ఒక్క నమస్కారం చేసేవారు. వారు అలా నమస్కారం చెయ్యగానే ఏడు సముద్రముల యొక్క పాయలు ఇటుగా ప్రవహించాయి. అప్పుడు మా గురువులు అందులో స్నానం చేశారు. మా గురువులు స్నానం చేసి తమ వస్త్రములను పిండి, ఇక్కడే తీగల మీద ఆరేసేవారు. నువ్వు ఆ వస్త్రములను ముట్టుకొని చూడు. అవి ఇప్పటికీ అలానే తడిగా ఉంటాయి. వారు ముట్టుకున్న ప్రతి వస్తువుని వారు ఏ స్థితిలో ముట్టుకున్నారో, అవి ఆ స్థితిలోనే ఉండిపోయాయి తప్ప ప్రకృతి యొక్క పరిణామగతంగా ఆ వస్తువులు మారలేదు. వారు అంతగా ఆత్మగతులై ఆత్మస్వరూపంగా ఉండిపోయారు.”

“రామా! నీకోసమని చెప్పి నేను ఈ అరణ్యం నుండి చాలా సంభారాలని సేకరించాను. నువ్వు వాటిని స్వీకరించు” అని చెప్పి, ఆ సంభారములని రాముడికి ఇచ్చి “మా గురువులు నీకు ఆతిధ్యం ఇవ్వమన్నారు. నేను ఇచ్చేశాను. అందుకని నేను వెళ్ళిపోదామని అనుకుంటున్నాను” అని చెప్పి, సంకల్పమాత్రం చేత అగ్నిని రగిల్చి, అందులో చీర కృష్ణాంబరాలతో సహా దూకి తన శరీరాన్ని వదిలేసింది. అప్పుడా అగ్నిలోనుంచి దివ్యమైన అంబరములతో, దివ్యమైన వస్త్రములతో ఆమె శరీరం బయటకి వచ్చి, తన గురువులు ఉన్న లోకాలకి వెళ్ళిపోయింది. ‘ఆహా, ఏమి ఋషులు, ఏమీ తపస్సు’ అని రామలక్ష్మణులు పొంగిపోయి, అక్కడినుండి బయలుదేరి ఋష్యమూక పర్వతం వైపు బయలుదేరారు.

*శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – పరిసమాప్తం*

Leave a comment