శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 41 & 42


*శ్రీమద్రామాయణం*

*అరణ్యకాండ – 41*

శాంతించిన రాముడితో లక్ష్మణుడు “అన్నయ్యా! చూశావా లోకం పోకడ ఎలా ఉంటుందో! కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో జ్ఞాపకం ఉందా? (ఎన్నో కష్టాలు పడి, ఎంతో గొప్పగా జీవించిన యయాతి చనిపోయాక స్వర్గానికి వెళ్ళాడు. అప్పుడు దేవేంద్రుడు యయాతిని ఒక ప్రశ్న అడిగాడు. అదేమిటంటే “యయాతీ! నీ రాజ్యంలో అసత్యం చెప్పని వాడు ఎవరు?” అని అడిగాడు. తాను ఎన్నడూ అసత్యం చెప్పలేదు కనుక ఆ యయాతి ఎంతో వినయంగా “నేను ఎన్నడూ అసత్యం పలకలేదు” అన్నాడు.

“నీ వైపుకి చూపించి, ఒక విషయాన్ని నీ అంతట నువ్వు పొగుడుకున్నావు కనుక నువ్వు మహా పాపత్ముడివి. అందుచేత నీకు స్వర్గలోక ప్రవేశం కుదరదు” అని చెప్పి దేవేంద్రుడు యయాతిని కిందకి తోసేశాడు. జీవితకాలం కష్టపడిన యయాతి, ఒక్క మాటకి, అది కూడా దేవేంద్రుడు అడిగితే చెప్పిన జవాబుకి, స్వర్గమునుండి పతనమై భూమి మీద పడిపోయాడు.”

“అలాగే మన గురువుగారైన వశిష్ఠుడికి నూరుగురు కుమారులు జన్మించారు. వాళ్ళల్లో ఒక్కడు కూడా భ్రష్టుడు కాదు. అందరూ తండ్రిమాట వినేవారే. అటువంటి నూరుగురు కుమారులు తండ్రిని గౌరవించకుండా మాట్లాడిన పాపానికి ఒకే రోజూ శాపానికి గురై శరీరాలని వదిలేశారు. అంత కష్టమొచ్చినా మన గురువు గారు బెంగపెట్టుకోలేదు.”

“మనం రోజూ చూసే భూమికి ఎంతో ఓర్పు ఉంది. ఎంతోమందిని భరిస్తుంది. ఈ భూమి ఎప్పటినుంచో ఉంది. ఇటువంటి భూమి కూడా ఒక్కొక్కనాడు పాపభారాన్ని మోయలేక కదులుతుంది. అంత గొప్ప భూమికి కూడా కష్టమొచ్చి కదులుతుంది.”

“ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులిద్దరు మహాబలం కలిగినవారు. వాళ్ళిద్దరి చేత ఈ లోకములన్ని ప్రకాశిస్తున్నాయి. అటువంటి సూర్యచంద్రులని పాప గ్రహాలైన రాహు కేతువులు గ్రహణ సమయంలో బాధిస్తున్నారు. మళ్ళీ విడిచి పెడుతున్నారు. మనిషికి జీవితంలో కష్టం వచ్చిననాడు, ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడిననాడు కదా, అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టకుండా ఉన్ననాడు కదా వాడిలో ఉన్నటువంటి సౌశీల్యం ప్రకాశించేది?”

“అందుకని అన్నయ్యా! దయ చేసి నీ కోపాన్ని విడిచిపెట్టు. నువ్వు జ్ఞానివి అన్నయ్యా! నీకు సమస్తం తెలుసు. కానీ నిప్పుని బూది కప్పినట్టు, నీలో ఉన్న జ్ఞానాన్ని శోకం కప్పింది. అందువలన నువ్వు కోపానికి వశుడవయ్యావు. నీకు చెప్పగలిగిన వాడిని అని నేను చెప్పడంలేదు. కేవలం నీ మీద కప్పబడ్డ శోకం అనే దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను, అంతే” అన్నాడు.

*[పూర్వజో అపి ఉక్త మాత్రః తు లక్ష్మణేన సుభాషితం |*
*సార గ్రాహీ మహాసారం ప్రతిజగ్రాహ రాఘవః ||]*

అవతలివారు చెప్పిన దానిలోని సారమును గ్రహించి, తన స్వరూపమును దిద్దుకోగలిగిన గొప్ప శక్తి కలిగిన రాముడు, లక్ష్మణుడు చెప్పిన మాటలని విని తన కోపాన్ని విడిచిపెట్టి “తమ్ముడా! నువ్వు చెప్పిన మాట యదార్ధం. కానీ నన్ను అనుగమించి వచ్చిన సీత కనపడకపోతే నేను బతకలేను. ఈ పర్వతగుహలలో ఎన్నో గుహలు, పొదలు ఉన్నాయి. సీత వాటిలో ఎక్కడయినా ఉందేమో వెతుకుదాము” అని రామలక్ష్మణులు ముందుకి బయలుదేరారు.

*శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 41 – సంపూర్ణం*

*శ్రీమద్రామాయణం*

*అరణ్యకాండ – 42*

అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిన రామలక్ష్మణులకు – ఒంటినిండా రక్తంతో తడిసిపోయి, ముక్కుకి రక్తంతో, రెక్కలు తెగిపోయి ఒక పక్కకి కూర్చుని ఉన్న – జటాయువు కనపడింది. అప్పుడు రాముడు “ఎవరో రాక్షసుడు ఈ పక్షి రూపాన్ని పొందాడు. నేను, లక్ష్మణుడు వెళ్ళగానే సీతని ఈ పక్షే తినేసింది. దీనిని నేను నమ్మను. ఇప్పుడిది నాకు ప్రమాదం తెచ్చింది. అందుకని ఇప్పుడు నేను ఈ జటాయువు యొక్క శరీరాన్ని చీల్చేస్తాను’ అని మనసులో అనుకొని, కోదండంలో బాణాన్ని సంధించి జటాయువు వైపు పరుగులు తీశాడు.

అప్పుడు జటాయువు “రామా! నువ్వు ఏ ఓషధిని గూర్చి ఈ అరణ్యంలో వెతుకుతున్నావో, అటువంటి ఓషధీ స్వరూపమైన సీతమ్మని, నా ప్రాణాలని పట్టుకుపోయినవాడు రావణాసురుడయ్యా! నువ్వు, లక్ష్మణుడు లేని సమయంలో రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకుపోయాడు. సీతమ్మని అపహరిస్తుంటే రావణాసురుడితో యుద్ధం చేశానయ్యా! నా శక్తి మేర అడ్డుపడ్డాను. రావణుడి రథాన్ని, సారధిని, ధ్వజాన్ని పడగొట్టాను. కానీ వాడిని నిగ్రహించలేకపోయాను. ఆకాశమార్గంలో సీతమ్మని ఎత్తుకు పోతూ ధూళిని, మేఘాల్ని సృష్టి చేశాడు. ఖడ్గంతో నా రెక్కలని కోసేశాడు. నా కాళ్ళు నరికేశాడు. అందుకని నేను ఏమీ చెయ్యలేకపోయాను. రామా! నేను చచ్చిపోయానయ్యా. ఇంకొకసారి నన్ను చంపకు” అన్నాడు.

జటాయువు మాటలు విన్న రాముడు, ఆ కోదండంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి జటాయువుని గట్టిగా కౌగలించుకుని ఏడిచాడు. ఆయన అలా ఏడుస్తున్నప్పుడు ఆ కోదండం చేతినుండి విడిపోయి కింద పడిపోయింది. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా జటాయువు మీద పడి ఏడిచాడు.

*[రాజ్యం భ్రష్టం వనే వాసః సీతా నష్టా మృతే ద్విజః |*
*ఈదృశీ ఇయం మమా లక్ష్మీః నిర్దహేత్ అపి పావకం ||]*

అప్పుడు రాముడు “నాకు రాజ్యం పోయింది. అరణ్యానికి వచ్చాను. సీతని పోగొట్టుకున్నాను. నమ్మిన స్నేహితుడైన జటాయువు మరణిస్తున్నాడు. ఇవ్వాళ నేను పొందుతున్న శోకానికి అగ్నిని తీసుకొచ్చి అక్కడ పెడితే, ఆ అగ్నిని నా శోకం కాల్చేస్తుంది. అంత శోకంలో నేను ఉన్నాను లక్ష్మణా!” అన్నాడు. అలాగే “జటాయూ! నాకోసం నువ్వు ఇంత కష్టపడ్డావు. ఒక్కసారి చెప్పు ఆ రావణుడు ఎక్కడ ఉంటాడు? అతని పౌరుష పరాక్రమాలు ఎటువంటివి? సీతని ఎటువైపుకి తీసుకెళ్ళాడు? ఏ రాజ్యాన్ని పరిపాలిస్తాడు? అతని స్వరూపం ఏమిటి? నాకు వివరంగా చెప్పు” అన్నాడు.

అప్పుడా జటాయువు “ఆ రావణుడు సీతమ్మని అపహరించి, మేఘములను, ధూళిని సృష్టించి, సీతమ్మని తన ఒడిలో కూర్చోపెట్టుకుని, ఆకాశ మార్గంలో దక్షిణ దిక్కుకి తీసుకెళ్ళిపోయాడు. ఇంతకన్నా చెప్పాలని ఉంది కానీ, నా రెక్కలు తెగిపోవడం వలన, నా కళ్ళు కనపడడం మానేశాయి. నా నోటి వెంట మాట రావడంలేదు. నువ్వు మాట్లాడుతున్నది వినపడడం లేదు. నాలో ఉన్న భావాలని చెప్పగలుగుతున్నానో, చెప్పలేకపోతున్నానో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అన్నిటినీ మించి ఈ అరణ్యం అంతా నాకు బంగారంలా కనపడుతోంది. వింద అనే ముహూర్తంలో రావణుడు దొంగిలించాడు కనుక, నీ వస్తువు నీకు దొరుకుతుంది. ఆ ముహూర్తంలో దొంగలించబడ్డ వస్తువుని తిరిగి యజమాని పొందుతాడు. నువ్వు సీతమ్మని పొందుతావు. మీ ఇద్దరికీ పట్టాభిషేకం అవుతుంది. నువ్వు చాలా కాలం రాజ్యపాలన చేస్తావు” అని చెబుతుండగా ఆయన నోటినుండి రక్తంతో కూడిన మాంసం ముద్దని కక్కి, తన చిట్టచివర ప్రాణాలని కూడా లాగి “ఆ రావణాసురుడి తండ్రి విశ్రవసో బ్రహ్మ, ఆయన తమ్ముడు కుబేరుడు” అని చెప్పి, శిరస్సు పక్కకి పడిపోగా, ఆ జటాయువు మరణించాడు.

*శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 42 – సంపూర్ణం*

Leave a comment