శ్రీమద్రామాయణం – అరణ్యకాండ –31 & 32


*శ్రీమద్రామాయణం*

*అరణ్యకాండ – 31*

అప్పుడు సీతమ్మ “నాకు అర్ధమయ్యిందిరా మహా పాపీ! కౄరాత్ముడా! నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదని అనుకోకు. రాముడు మరణించాడన్న మాటని ధృవపరుచుకోడానికి ఇక్కడ నిలుచున్నావు. నన్ను పొందడం కోసమే నువ్వు రాముడి వెనకాల వచ్చావు. నిన్ను భరతుడే పంపించాడు. మీ ఇద్దరూ కలిసి కుట్ర చేశారు. కానీ నువ్వు ఒక విషయం తెలుసుకో! ఇందీవరశ్యాముడైన రాముడు పడిపోయాక నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. నేను వెళ్ళమన్నా వెళ్ళకుండా, రాముడు ప్రాణాపాయంలో ఉంటే నువ్వు నా వద్ద నిలబడి మాట్లాడుతున్నావు కనుక, నీ ఎదుటనే విషం తాగి శరీరాన్ని విడిచిపెట్టేస్తాను” అన్నది.
అప్పుడు లక్ష్మణుడు “ఎంత ప్రమాదం తెచ్చావు వదినా ఈ రోజు? నేను ఇక్కడ నిలబడితే నీ ప్రాణాలు తీసుకుంటావు, నేను వెళ్ళిపోతే నీకు ప్రమాదం వస్తుంది” అని అన్నాక రెండుచేతులతో సీతమ్మ పాదాలు పట్టుకొని “వదినా! నువ్వు ఇవ్వాళ ఒక సామాన్యమైన స్త్రీ మాట్లాడినట్టు మాట్లాడావు. నువ్వు నన్ను ఇన్ని మాటలు అన్నావు కానీ నేను మాత్రం ఒక్కదానికి కూడా జవాబు చెప్పను. ఆ మాటలకి ఏమి చెప్పుకొని జవాబు చెప్పను? నేను నిన్ను ఎన్నడూ ఆ భావనతో చూడలేదు. అటువంటి నన్ను ఇన్ని మాటలు అన్నావు? భరతుడిని కూడా కలిపావు. ఎన్ని మాటలు చెబితే నేను తిరిగి నీ మాటలకి జవాబు చెప్పగలను? అందుకని నేను ఏ ఒక్క మాటకి జవాబు చెప్పను. నువ్వు వదినవి, పెద్దదానివి. అనడానికి నీకు అర్హత ఉంది. కానీ నన్ను ఇన్నిమాటలు అని దూరంగా పంపించడం వలన ఫలితాన్ని మాత్రం నువ్వు పొందుతావు.”
“వదినా! నాతో అన్న మాటలని నేను అన్నయ్యతో చెప్పలేను కనుక, ఓ వనదేవతలారా! మీరు నాకు సాక్ష్యంగా ఉండండి. నేను ఇప్పుడు వదినని వదలి వెళ్ళడంలో ఉన్న న్యాయాన్ని వనదేవతలు గ్రహించెదరుగాక. వదినా! నేను రాముడి దగ్గరికి వెళుతున్నాను. నిన్ను ఈ వనదేవతలు రక్షించాలని కోరుకుంటున్నాను” అని వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి సీతమ్మ పాదాల వంక చూసి శిరస్సు వంచి నమస్కరిస్తూ “అమ్మా! నేను మళ్ళీ తిరిగొచ్చి, మా అన్నయ్య నీ పక్కన నిలుచుంటే, మా అన్నయ్య పాదాలకి, నీ పాదాలకి కలిపి నమస్కరించే అదృష్టం నాకు దొరుకుతుందా?” అన్నాడు.
అప్పుడు సీతమ్మ “పాపిష్ఠివాడా! నువ్వు ఇంకా వెళ్ళకుండా నిలుచుంటే నీకు దక్కుతానని అనుకుంటున్నావేమో? నా పాదంతో కూడా నిన్ను తాకను. నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడే విషం తాగన్నా, అగ్నిలో దూకన్నా, గోదావరిలో దూకన్నా, ఉరి వేసుకొని అయినా చనిపోతాను. కదులుతావా, కదలవా?” అని సీతమ్మ తన కడుపు మీద బాదుకొని ఏడ్చింది. అప్పుడా లక్ష్మణుడు సీతమ్మకి ప్రదక్షిణం చేసి ఏడుస్తూ వెళ్ళిపోయాడు.
అప్పటి దాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని, ఎడమ భుజానికి కమండలాన్ని ధరించి, రాశీభూతమైన తేజస్సుతో పరివ్రాజక (సాధువు) వేషాన్ని ధరించి ఆశ్రమం వైపు వెళ్ళాడు. రావణాసురుడు మారువేషంలో వస్తున్నాడని అక్కడున్నటువంటి చెట్లు కనిపెట్టి కదలడం మానేసి అలా నిలబడిపోయాయి. అప్పటిదాకా చక్కగా వీచిన గాలి రావణుడిని చూడగానే మందంగా వీచింది. రావణుడు తన ఎర్రటి కళ్ళతో చూసేసరికి, అప్పటిదాకా ఉరకలు వేసిన గోదావరి చప్పుడు చెయ్యకుండా చాలా నెమ్మదిగా ప్రవహించింది.

*శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 31 – సంపూర్ణం*

*శ్రీమద్రామాయణం*

*అరణ్యకాండ – 32*

అలా ఆ రావణుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి “నువ్వు పచ్చని పట్టుచీర కట్టుకొని, పద్మం వంటి ముఖంతో, పద్మములవంటి చేతులతో, పద్మాలలాంటి పాదాలతో ఉన్నావు. నువ్వు భూమి మీద యదేచ్ఛగా తిరగడానికి వచ్చిన రతీదేవివా! నీ ముఖం ఎంత అందంగా ఉంది? నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి?” అంటూ సీతమ్మని కేశములనుండి పాదముల వరకూ అంగాంగ వర్ణన చేశాడు. అలాగే “చాలా వేగంగా ప్రవహిస్తున్న నది – ఒడ్డుని విరిచినట్టు – నువ్వు నా మనస్సుని విరిచేస్తున్నావు. యక్ష, కిన్నెర, గంధర్వ స్త్రీలలో నీవంటి స్త్రీని నేను ఎక్కడా చూడలేదు. ఇంత అందమైన దానివి ఈ అరణ్యంలో ఎందుకున్నావు? అయ్యయ్యో! ఇది చాలా క్రూరమృగాలు ఉండే అరణ్యం. ఇక్కడ రాక్షసులు కామ రూపాలలో తిరుగుతుంటారు. నువ్వు తొందరగా ఇక్కడినుంచి వెళ్ళిపో. నువ్వు మంచి మంచి నగరాలలో, పట్టణాలలో ఉండాలి. అక్కడ ఉండి సుఖాలు అనుభవించాలి. నువ్వు శ్రేష్టమైన మాలికలు, హారాలు వేసుకోవాలి. మంచి బట్టలు కట్టుకోవాలి. అన్నిటితో పాటు నీకు మంచి భర్త ఉండాలి” అన్నాడు.

(ఒక ఆడదాన్ని అనుభవించాలనే బుద్ధితో ఆమె దగ్గరికి వచ్చి, ఆమె అందాన్ని పొగుడుతూ, తనని తాను పొగుడుకుంటూ, ప్రేమ అనే అందమైన భావాన్ని అడ్డుపెట్టుకుని మాట్లాడే వాళ్ళలాగ ఆనాడు రావణుడు మాట్లాడాడు.)

కానీ సీతమ్మ తల్లి మనస్సు రాముడి మీదనే ఉండిపోవడం వలన, రావణుడి నీచపు మాటలని ఆమె సరిగ్గా పట్టించుకోలేదు. కానీ ఇంటికొచ్చిన అతిథికి ఎంత గౌరవంగా పూజ చేస్తారో, అలా ఆ భిక్షువు రూపంలో ఉన్న రావణుడికి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టింది. ఆయనకి అర్ఘ్య పాద్యములు ఇచ్చింది.

‘సీతాపహరణం ద్వారా తనని తాను చంపుకోడానికి సిధ్దపడుతున్న రావణాసురుడికి సమస్తమైన అతిథి పూజ సీతమ్మ చేస్తుంది’ అని వాల్మీకి మహర్షి అన్నారు.

అప్పుడా సీతమ్మ “నా పేరు సీత. నేను జనక మహారాజు కూతురిని. శ్రీరామచంద్రమూర్తి ఇల్లాలిని. నేను ఇక్ష్వాకువంశంలో పుట్టిన రాముడిని పెళ్ళి చేసుకున్న తరువాత మనుషులు అనుభవించే భోగములన్నిటిని అనుభవించాను. (సీతమ్మ తనని తాను జగన్మాతగా రావణుడికి పరోక్షంగా చెప్పింది). మా అత్తమ్మ కైకమ్మ కోరిక మేరకు 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడానికి రాముడు అరణ్యాలకి వచ్చాడు. ఆయనతోబాటు నేనూ, ఆయన తమ్ముడైన లక్ష్మణుడు కూడా ఈ అరణ్యవాసానికి వచ్చాము. లక్ష్మణుడు సర్వ కాలముల యందు మాకు సేవ చేస్తూ ఉంటాడు.”

*[మమ భర్తా మహాతేజా వయసా పంచ వింశకః ||*
*అష్టా దశ హి వర్షాణి మమ జన్మని గణ్యతే ||]*

“అరణ్యవాసానికి వచ్చేటప్పటికి నాకు 18 సంవత్సరాలు. రాముడికి 25 సంవత్సరాలు” అని చెప్పి “ఓ బ్రాహ్మణుడా! నువ్వు ఒక్కడివి ఈ అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు? నీ గోత్రం ఏమిటి? నువ్వు ఎవరు?” అని అడిగింది. అప్పుడా రావణుడు “సీతా! నా పేరు రావణాసురుడు. నన్ను చూస్తే దేవతలు, గంధర్వులు, యక్షులు తదితరులందరూ భయపడి పోతారు. నార చీర కట్టుకున్నా ఇంత అందంగా ఉన్న నీ స్వరూపాన్ని చూసిన దగ్గర నుంచీ నా మనసు నిలవడం లేదు. నువ్వు నాతో వస్తే, నిన్ను లంకా నగరానికి తీసుకొని వెళ్ళి పట్టమహిషిని చేస్తాను. నువ్వు నా భార్యవి అయితే సమస్త లోకాలలో ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి నీకు ఇస్తాను” అన్నాడు.

*శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 32 – సంపూర్ణం*

Leave a comment