శ్రీమద్రామాయణం – అరణ్యకాండ –23 & 24


*శ్రీమద్రామాయణం*

*అరణ్యకాండ – 23*

*[దీర్ఘబాహుః విశాలాక్షః చీర కృష్ణ అజిన అంబరః |*
*కందర్ప సమ రూపః చ రామో దశరథ ఆత్మజః ||]*

అప్పుడా శూర్పణఖ “రాముడు పెద్ద పెద్ద చేతులతో, విశాలమైన కన్నులతో, మునుల వలె నార చీర, కృష్ణాజినం వేసుకొని, మన్మధుడిలా అందమైన రూపంతో ఉంటాడు. ఆయన దశరథ మహారాజు పెద్ద కుమారుడు. దేవేంద్రుడు పట్టుకున్నట్టు ధనుస్సుని పట్టుకొని, నారాచ బాణములను సంధిస్తే, అవి నోరు తెరుచుకొని విషం కక్కుతూ వస్తున్న మహా సర్పాలలాగ ఉంటాయి. రాముడు 14,000 మంది రాక్షసులని చంపుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. చంపినవాడు రాముడని నాకు తెలుసు. కానీ రాముడు బాణం ఎప్పుడు తీశాడో, వింటినారికి ఎప్పుడు తొడిగాడో, ఎప్పుడు గురిచూసి వదిలాడో నేను చూడలేదు. కానీ రాక్షసుల తలకాయలు ఒక్కొక్కటిగా తృటిలో తెగిపోవడం నేను చూశాను. రాముడు అంత తీవ్రమైన వేగంతో బాణ ప్రయోగం చేస్తాడు. రాముడితో గుణములయందు, తేజస్సుయందు సమానమైనవాడు ఆయన తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు.

*[రామస్య దక్షిణే బాహుః నిత్యం ప్రాణో బహిః చరః |]*

ఆ లక్ష్మణుడు రాముడికి కుడి భుజంలా, బయట తిరుగుతున్న ప్రాణంలా సర్వకాలములయందు రాముడిని రక్షిస్తూ ఉంటాడు. రాముడి భార్య పేరు సీత. ఆమె ముఖం పూర్ణ చంద్రబింబంలా ఉంటుంది. విశాలమైన నేత్రములు కలిగి ఉంటుంది. నిరంతరం రాముడిని అపారమైన ప్రేమతో సేవిస్తూ ఉంటుంది. ఆమె నల్లటి జుట్టుతో ఉంటుంది. అందమైన ముక్కుతో, అందమైన స్వరూపంతో ఉంటుంది. ఎంతో కాంతివంతంగా ఉంటుంది. ఆవిడ సాక్షాత్తు ఇంకొక శ్రీలక్ష్మిలా ఉంటుంది. కాల్చి తీసిన బంగారంలా ఆవిడ శరీరం ఉంటుంది. ఎర్రటి రక్తం లోపలినుంచి కనబడుతున్నటువంటి తెల్లటి గోళ్ళతో ఉంటుంది. పద్మంలాంటి ముఖంతో, సన్నటి నడుముతో ఉంటుంది. ఆవిడ గంధర్వులకి, యక్షులకి, కిన్నెరులకి, దానవులకి చెందినదికాదు. ఆమె నరకాంత. కానీ ఈ భూమండలంలో నేను ఇప్పటివరకూ అటువంటి సౌందర్యరాశిని చూడలేదు. సీత ఎవరిని గాఢాలింగనం చేసుకుంటుందో, ఎవడు సీతకి భర్త అని అనిపించుకుంటాడో, వాడే మూడు లోకములలో ఉన్న ఐశ్వర్యాన్ని పొందినవాడు. వాడు ఇంద్రుడితో సమానమైన కీర్తిని గడించినవాడు. అతడే ఆ రాముడు.

నాకు ఆ సీతని చూడగానే, ఈమె మా అన్నయ్యకి భార్య అయితే ఎంత బాగుంటుందో అనిపించింది. అందుకని నేను సీతని తేవడానికి ప్రయత్నిస్తే, ఆ లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోసేశాడు అన్నయ్యా! నువ్వు కానీ సీతని చూస్తే, మన్మధ బాణాలకి వశుడవయిపోతావు. నిజంగా నీకు సీతని భార్యని చేసుకోవాలని ఉంటే, ఇంక ఆలోచించకుండ వెంటనే బయలుదేరు. నువ్వు సీతని నీదిగా అనుభవించు, అడ్డొచ్చిన రాముడిని సంహరించు” అన్నది.

*శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 23 – సంపూర్ణం*

*శ్రీమద్రామాయణం*

*అరణ్యకాండ – 24*

శూర్పణఖ మాటలు విన్న రావణుడు తన చుట్టూ కూర్చున్న మంత్రుల వంక చూసి “సభ చాలిస్తున్నాను. ఇక మీరు బయలుదేరండి” అన్నాడు. అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర మార్గం మీదుగా పయనమయ్యాడు. అలా వెళుతుండగా ఆయనకి ఒక పెద్ద వట వృక్షం కనబడింది. (తన తల్లి అయిన వినతకి దాస్య విముక్తి చెయ్యడానికని, గరుత్మంతుడు అమృతం తేవడానికి బయలుదేరేముందు తన తండ్రి అయిన కశ్యపుడిని అడిగాడు. నేను ప్రయాణం చేసేటప్పుడు ఆకలి వేస్తుంది కదా, అప్పుడు ఆహారం ఎక్కడ దొరుకుతుంది అని. అప్పుడా కశ్యపుడు “నువ్వు హిమాలయ పర్వతాలకి సమీపంగా వెళుతున్నప్పుడు ఒక పెద్ద సరోవరం కనబడుతుంది, ఆ సరోవరం ఒడ్డున రెండు గజకచ్ఛపాలు కొట్టుకుంటూ ఉంటాయి. అవి ఒక తాబేలు, ఒక ఏనుగు. పూర్వకాలంలో, ఒక బ్రాహ్మణుడికి విభాసుడు, సుప్రతీకుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ బ్రాహ్మణుడు మరణించిన కొంత కాలానికి ఆ అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలలో తేడాలు వచ్చి, ఒకరిని ఒకరు శపించుకున్నారు.

విభాసుడు సుప్రతీకుడిని ఒక పెద్ద ఏనుగుగా అవ్వమని, సుప్రతీకుడు విభాసుడిని ఒక పెద్ద తాబేలుగా అవ్వమని శపించుకున్నారు. ఆ తాబేలు చుట్టుకొలత 10 యోజనములు, మందం 3 యోజనములు ఉంటుంది. ఆ ఏనుగు 6 యోజనముల ఎత్తు, 12 యోజనముల పొడువు ఉంటుంది. ఏనుగు తాబేలుని బయటకి లాగాలని చూస్తుంటుంది, తాబేలేమో ఏనుగుని నీళ్ళల్లోకి లాగెయ్యాలని చూస్తుంది. అవి అలా కొన్ని వేల సంవత్సరముల నుండి కొట్టుకుంటూ ఉన్నాయి. అవి అలా కొట్టుకుంటూ ఉండడం వలన ఆ చుట్టుపక్కల ఎవరూ ఉండడంలేదు. కనుక ఆకలి వేస్తే ఆ రెండిటినీ తినేసెయ్యి” అని కశ్యప ప్రజాపతి అన్నాడు. గరుత్మంతుడు సరే అని బయలుదేరాడు.

అలా వెళుతూ వెళుతూ ఆ ఏనుగుని, తాబేలుని చూశాడు. ఆ రెండింటినీ తన కాలి గోళ్ళతో పైకి ఎత్తి, న్యగ్రోధం అనే మహావృక్షం యొక్క కొమ్మ మీద ఆ రెండిటినీ పెట్టాడు. ఆ గజకచ్ఛపాల బరువుకి ఆ కొమ్మ విరిగిపోతుండగా, గరుత్మంతుడు తన ముక్కుతో ఆ కొమ్మని పైకి ఎత్తి ఒక భద్రమైన స్థానానికి చేర్చాడు. తరువాత ఆ గజకచ్ఛపాలని ఒక పర్వతం మీద పెట్టుకొని తినేశాడు. ఆ తరువాత ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అమృతాన్ని తెచ్చి వినతని దాస్యం నుండి విముక్తురాలిని చేశాడు. ఆనాడు గరుత్మంతుడు ఆ గజకచ్ఛపాలని పెట్టినది ఈ వృక్షం మీదనే). రావణుడు ఆ న్యగ్రోధం అనే వృక్షాన్ని చూసి, కిందకి దిగి చుట్టూ చూసేసరికి, ఆయనకి ఒక తాపస ఆశ్రమం కనబడింది.

అప్పుడాయన ఆ ఆశ్రమంలోకి వెళ్ళి చూడగా, అందులో నారచీర కట్టుకొని, జటలు వేసుకొని, నియమముతో ఆహారాన్ని తింటున్నటువంటివాడై, ఒకప్పుడు రాక్షసుడైనటువంటి మారీచుడు కనబడ్డాడు. అప్పుడా రావణాసురుడు ఓ మారీచా! నేను ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నాను. నీవంటి మహాత్ముడు కాకపోతే నాకు ఎవరు ఉపకారం చేస్తారు? నువ్వు నాకు తప్పకుండా ఉపకారం చెయ్యాలి.

*శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 24 – సంపూర్ణం*

Leave a comment