శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 17 & 18


*శ్రీమద్రామాయణం*

*అరణ్యకాండ – 17*

ఈ మాటలు విన్న ఖరుడికి ఎక్కడలేని ఉక్రోషం వచ్చి “నేను ఇప్పుడే బయలుదేరతాను. నా ఎదుట యుద్ధంలో దేవేంద్రుడే నిలబడ్డా సంహరిస్తాను. మృత్యుదేవతకి మృత్యువుని నేను. నేను కానీ యుద్ధానికి వెళితే, నా ముందు నిలబడగలిగే వాడు అంటూ ఎవడూ ఉండడు” అని పలికి, 14,000 మంది రాక్షసులతో కలిసి రామలక్ష్మణుల మీదకి యుద్ధానికి బయలుదేరాడు. ఆ ఖరుడు బంగారంతో చెయ్యబడ్డ రథం ఎక్కి బయలుదేరాడు. అప్పుడు గాడిద రంగులో ఉన్నటువంటి మేఘాలు ఆకాశంలో వచ్చి ఎర్రటి నీటిని వర్షించాయి. ఆయన రథాన్ని నడుపుతున్న గుర్రాలు చాలా సమతలంగా ఉన్నటువంటి ఆ దారిలో తొట్రుపడి, ముందుకి పడిపోయి, పైకి లేచి నడిచాయి. ఆకాశంలో సూర్యుడి చుట్టూ నలుపు-ఎరుపు రంగుల వలయం ఏర్పడింది. ఒక గ్రద్ద ఎగురుతూ వచ్చి ఆయన ధ్వజం మీద వాలి వెళ్ళిపోయింది. దిక్కులన్నీ అకారణంగా చీకటితో నిండిపోయాయి. నక్కలు నోట్లోనుంచి అగ్నిని కక్కుతూ, ఎదురుగా వచ్చి పెద్దగా ఏడిచాయి. ఇన్ని దుశ్శకునాలు ఎదురొచ్చినా, ఆ ఖరుడు వాటిని లెక్కపెట్టకుండా ముందుకి వెళ్ళాడు. ఆ ఖరుడి చుట్టూ 12 మంది రాక్షస సేనానులు నిల్చున్నారు. వాడితోపాటు దూషణుడు, త్రిశిరస్కుడు, ప్రమాథి, స్థూలాక్షుడు, మహాకపాలుడు మొదలైన భయంకరమైన రాక్షసులు కూడా బయలుదేరారు.

అటుపక్క రాముని ఆశ్రమంలో, పక్షులు చిత్రవిచిత్రమైన కూతలు కూస్తున్నాయి. భూమి ఒక్కసారి కంపించింది. అలా కంపించడం వలన బంగారు పిడి కలిగిన రాముని ధనస్సు ఎగిరి ఎగిరి పడుతోంది. బాణముల చుట్టూ ధూమం ఆవరించింది. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి “లక్ష్మణా! నిష్కారణంగా పర్ణశాలలో ఉన్న ధనుస్సు – భూమి కంపించేసరికి – ఎగిరి ఎగిరి పడుతోంది. అలాగే బాణముల చుట్టూ ధూమం ఆవహిస్తోంది. అంటే గొప్ప యుద్ధం వస్తోందని ధనుర్బాణములు ఆనందపడుతున్నాయి. దూరంగా పక్షి కూస్తోంది అంటే. ఈ యుద్ధంలో జయాపజయాలు దైవనిర్ణయాలు. ఖచ్ఛితంగా మనం గెలుస్తామని నా మనసు చెప్తోంది.

*[తస్మాత్ గృహీత్వా వైదేహీం శర పాణిః ధనుర్ ధరః |*
*గుహాం ఆశ్రయ శైలస్య దుర్గాం పాదప సంకులాం ||]*

అందుకని లక్ష్మణా! నువ్వు వెంటనే ధనుర్బాణములని పట్టుకొని, సీతని తీసుకొని, ఎవరు చూసినా కూడా కనపడనంతగా చెట్లతో కప్పబడిన ఒక పర్వత గుహలోకి వెళ్ళిపో. నేను యుద్ధం చేస్తాను. నువ్వు నాతో ‘సీతమ్మని తీసుకొని లోపలికి వెళ్ళిపో’ అనే మాటలు చెప్పకు. నువ్వు యుద్ధం చెయ్యలేవు అని కాదు. నువ్వు ఒక్కడివే వీళ్ళని చంపగలవు. కానీ వీళ్ళతో యుద్ధం చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. అంతేకానీ నిన్ను తక్కువ చేసి చూడడం లేదు. నేను చెప్పింది విని తొందరగా సీతని తీసుకొని వెళ్ళిపో” అన్నాడు. అప్పుడు సీతమ్మని తీసుకొని లక్ష్మణుడు ఒక పర్వత గుహలోకి వెళ్ళాడు.

క్రోధంతో కోదండాన్ని పట్టుకొని ఉన్న రాముడిని చూస్తే, ఆనాడు పినాకిని అనే ధనుస్సుని పట్టుకొని దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యడానికి నిలబడ్డ రుద్రుడైన శివుడిలా ఉన్నాడని వాల్మీకి మహర్షి చెప్పారు.

*శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 17 – సంపూర్ణం*

*శ్రీమద్రామాయణం*

*అరణ్యకాండ – 18*

ఆశ్రమానికి వచ్చిన ఖరుడు తన సైన్యంతో రాముడిని చుట్టుముట్టాడు. మధ్యలో రాముడు ఒక్కడే ఉన్నాడు. రాముడి చుట్టూ 14,000 మంది రాక్షసులు నిలబడ్డారు. అప్పుడు వారంతా రాముడి మీద బాణాలు, శూలాలు, గదలు మొదలైనవి విసిరారు. వాటి దెబ్బలకి రాముడి ఒళ్ళంతా నెత్తురోడింది. నదీ ప్రవాహం వచ్చి కలిసిపోతునప్పుడు సముద్రం ఎలా సంతోషంగా ఉంటుందో, పెద్ద వర్షం పడుతున్నప్పుడు, ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఆబోతు ఎలా నిలబడుతుందో అలా రాముడు నిలబడి, ఆ బాణ ప్రవాహాన్ని స్వీకరిస్తూ నిలబడ్డాడు.

రాముడు ఒక్కసారి తన ధనుస్సుని తీసి మండలాకారంగా తిప్పి ఆ రాక్షసుల మీద బాణ ప్రయోగం చేశాడు. ఎప్పుడు ఆ అక్షయబాణ తూణీరంలొ నుంచి బాణం తీశాడో, ఎప్పుడు ఆ బాణాన్ని తన ధనుస్సుకి సంధించాడో, ఎప్పుడు గురి చూసి ఆ బాణాన్ని విడిచిపెట్టాడో ఎవరూ చూడలేదు. అంత వేగంగా బాణ ప్రయోగం చేశాడు. రాముడు ఒక్కడు నేల మీద నుంచి యుద్ధం చేస్తుంటే, దారుణంగా 14,000 మంది రాక్షసులు రథాలలో ఉండి రాముడితో యుద్ధం చేస్తున్నారని ఆకాశంలో దేవతలు, మునులు నిలబడి రాముడికి విజయం చేకూరాలని ఆశీర్వదించారు. ఆ యుద్ధానికి దిక్కులన్నీ కదిలిపోతున్నాయి. పర్వతాలు ప్రకంపించాయి. వన దేవతలు వనాన్ని విడిచి పారిపోయారు. క్రూరమృగాలు దిక్కులు పట్టి పారిపోయాయి. రాముడి బాణ పరంపరకి ఏనుగుల తొండాలు తెగిపోయాయి. గుర్రాల కాళ్ళు రాలిపోయాయి. రాక్షసుల కంఠాలు నేల మీద పడ్డాయి. కొందరికి భుజాలు, కొందరికి కాళ్ళు తెగిపోయాయి. రాముడు ఏక కాలంలో 13 బాణాలని వింటినారికి తొడిగి విడిచిపెట్టేవాడు. అలా ఆ 14,000 మంది రాక్షసులని రాముడు ఒక్కడే సంహరించాడు.

దూషణుడు ఆగ్రహంతో ఒక పరిఘని పట్టుకొని రాముడి మీదకి వచ్చాడు. అప్పుడు రాముడు వాడి రెండు చేతులు నరికి ఒక దెబ్బ కొట్టాడు. రాముడు కొట్టిన దెబ్బకి ఆ దూషణుడు ఏనుగు పడిపోయినట్టు నేల మీద పడి మరణించాడు. ఇంక ఆ యుద్ధరంగంలో ఖరుడు, త్రిశిరస్కుడు మాత్రమే మిగిలారు. ఖరుడి ఆజ్ఞ మేరకు త్రిశిరస్కుడు యుద్ధానికి వచ్చి రాముడి చేతిలో మరణించాడు.

*శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 18 – సంపూర్ణం*

Leave a comment