హనుమ నామం ప్రణవ స్వరూపమని


హ ను మ.

అకార, ఉకార, మకారాల కలయికే { హ ( హ్ + అ ), ను ( న్ + ఉ ), మ. } అనీ, హనుమ నామం ప్రణవ స్వరూపమని, యెంతో చక్కగా వివరించారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, వారి ప్రవచనంలో.

అంతేకాదు, ‘ ఓం శ్రీ హనుమతే శ్రీ రామదూతాయ శ్రీ ఆంజనేయాయనమః : ‘ అనే మంత్రాన్ని, హనుమాన్ చాలీసా చదివే, ముందు మూడుసార్లు, తరువాత మూడుసార్లు, ఉచ్చరించమని, ఆదేశించారు. కార్యసిద్ధి జరుగుతుందని చెప్పారు. ఆచరిద్దామా !

ఈరోజు వైశాఖ బహుళ దశమి. హనుమజ్జయంతి. ఈ సందర్భంగా, హనుమంతుని వీరోచిత కార్యం, మననం చేసుకుందాం :

సుందర కాండ .. సుందరమైన కాండ… సుందరుని కాండ….

నిప్పంటింపబడిన తోకతో, హనుమంతుడు రావణునిభవనంతో పాటు, అనేక భవనాలలో ప్రచండమారుత వేగంతో తిరుగాడాడు. అగ్నిజ్వాలలు అదుపుతప్పి భవనాల పై అంతస్తులు నేలకూలాయి. ఆ ఉష్ణోగ్రతకి స్వర్ణ, రజిత ఆడంబర అలంకారాలు ద్రవీభవించి, లావావలే వీధుల్లోకి ప్రవహించాయి.

తమ ఆస్థుల కోసం, ధ్వంసం అవుతున్న అశ్వాలు, యేనుగుల కోసం, రాక్షసుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఆ జ్వలిస్తున్న అగ్ని చూసేవారికి ‘ జగత్తుకు విలయం ముంచుకొస్తున్నదా ‘ అనిపించేటట్లు వున్నది. రాక్షసులైతే, ” ఈతడు వానరమా లేక అగ్నిదేవుడా ? ఇంద్రుడు గానీ, బ్రహ్మగానీ, కాలుడుగానీ లేక విష్ణుశక్తి గానీ ఈ రూపం లో రాలేదుకదా! ” అని విపరీతమైన ఆశ్చర్యం వెలిబుచ్చుతున్నారు.

నగరమంతా చుట్టివచ్చిన హనుమంతుడు, ఆ అగ్నికీలలను చూసి యెంతో తృప్తి చెందాడు. సముద్రం దగ్గరికి వెళ్లి, తన వాలానికివున్న అగ్నిని చల్లార్చాడు. ఉన్నట్లు వుండి హనుమంతునికి భయంకరమైన అనుమానం కలిగింది. ” నేనుచేసిన ఈ లంకాదహనమనే మూర్ఖమైన పనివలన సీతకూడా దగ్ధమైపోయిందా ?

ఆహా ! మితిమీరిన క్రోధం యెంత పని చేసింది ! కోపం వస్తే విచక్షణ వుండదు కదా ! కోపానికి వశుడైన వాడు గురువును, తల్లిని కూడా ఉపేక్షింపడు. మహాత్ములను అవమానిస్తాడు. సీత మరణించి వుంటే, ఈ ప్రయత్నమంతా వ్యర్ధమే కదా ! అక్కడ కిష్కింధలో, అయోధ్యలో యెవరూ ప్రాణాలతో మిగలరు ” అనుకంటూ విలపిస్తూ వుండగా కొన్ని శుభశకునాలు గోచరించి, ఊరటపడ్డాడు.

ఇంతసేపూ హనుమంతుని వీరోచితకార్యాన్ని వీక్షిస్తున్న సిద్ధులూ, చారణులు, యితర దివ్యపురుషులు, సీత సురక్షితంగా ఉన్నదనే వార్త, హనుమంతునికి తెలిపారు. శీఘ్రమే సీత వున్నచోటుకు వెళ్ళాడు. ఆమెను చూసి ఆనందబాష్పాలు కార్చాడు. సీత మరియొకసారి, తాను వున్న పరిస్థితులు రామునికి గట్టిగా వివరించి చెప్పమని, హనుమను కోరింది. హనుమ కూడా ఆమెను స్వాంతనపరచి, రాముని శక్తి సామర్ధ్యాలు మరియొకసారి గుర్తుచేసి, ఆమె సంశయం పోగొట్టాడు.

తాను వచ్చిన కార్యం పూర్తి అయిందని భావించిన హనుమంతుడు ‘ ఆర్శిత పర్వతం ‘ ని అధిరోహించి, కాయాన్నిపెంచి, పర్వతాన్ని అదుముతూ, పైకెగరాడు. ఆ పర్వతం ఆయన ధాటికి 30 యోజనాల లోతుకి దిగబడిపోయింది. శిఖరం నుజ్జునుజ్జు అయింది. తిరుగు ప్రయాణంలో హనుమంతుడు మరియొకసారి గౌరవపూర్వకంగా మైనాక పర్వతాన్ని స్పర్శించాడు. చివరకు మహేంద్ర పర్వతాన్ని సమీపిస్తూ, తన వానర మిత్రులను కలుసుకునే ఉత్సుకతతో, వాలచాలనం చేస్తూ విజయోత్సాహంతో, శబ్దాలు చేస్తూనే వున్నాడు.

హనుమంతుని అరుపులు వింటూనే, అతను తనకొసంగిన కార్యంలో సఫలీక్రుతుడు అయినాడని గ్రహించిన జాంబవంతుడు, వానరులు, ఇనుమడించిన ఉత్సాహంతో, తమ వస్త్రాలను ఆనందసూచకంగా వూపుతూ, వాలాలని విజయ గర్వంగా ప్రదర్శిస్తూ, ఒక వృక్షంనుండి మరొక వృక్షంమీదకు, ఒక పర్వతశిఖరం నుండి వేరొక దానిమీదకు చెంగుచెంగున దూకసాగారు.

హనుమంతుడు కనుచూపు మేరకురాగానే, మహేంద్ర పర్వతం పైకి దిగడాన్ని ముకుళిత హస్తాలతో వీక్షించారు. హనుమంతుని చుట్టూచేరి, కేరింతలు కొట్టారు. కందమూలాలు సమర్పించారు. హనుమంతుడు పెద్దలందరికీ నమస్కరించి, తర్వాత అంగదునికి అభివాదం చేశాడు. వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి, వారిని సంతృప్తి పరచాడు. సీతను చూశానని చెప్పగానే, వారు హనుమంతుని పదేపదే ఆలింగనం చేసుకున్నారు. .

అంగదుడు , జాంబవంతుడుతో సహా, హనుమంతుని సాహస కార్యాన్ని, యింకా యింకా వినాలని ఉత్సాహంతో అందరూ హనుమంతుని చుట్టూ చేరారు. తన వీరోచిత కార్యాన్ని విశదంగా వివరించమని అడిగారు. హనుమంతుడు సీతకు మనస్సులోనే నమస్కరించి, అంతా పూసగ్రుచ్చినట్లు చెప్పాడు. ” నిరంతరం రాముని ధ్యాసలో వున్నది కాబట్టి, సీత సజీవంగా వున్నది. ఆమెను శీఘ్రమే రక్షించకబోతే, ఆమె శుష్కించి మరణించడం తధ్యం.” అని ముగించాడు.

అందుకు అంగదుడు ” మనం ఇటునించి ఇటే లంకమీదకు యుద్ధానికి వెళ్లి సీతను విడిపించుకునివద్దాము ” అన్నాడు. కానీ, హనుమంతుడు ” తనతో రమ్మనమంటేనే సీత రాలేదు. రాముని చేత శత్రుసంహారం చేయించి గానీ రానని చెప్పింది. ” అని ఆ ప్రయత్నం విరమింపచేశాడు.

ఓం శ్రీ హనుమతే శ్రీ రామదూతాయ శ్రీ ఆంజనేయాయ నమ :

స్వస్తి.

సేకరణ

🌺🙏🙏🙏🙏🙏🌺

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s