కలి దోష నివారణకు లలితా సహస్ర నామ స్తోత్ర పారాయణం.


శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గ స్థితి లయేశ్వరీమ్,
నమామి లలితాం నిత్యాం మహా త్రిపుర సుందరీమ్.

శ్రీవిద్య అనబడే బాలా, నవాక్షరి, పంచదశి, షోడశీ మంత్ర రూపిణిగా వుండేది, ఈరేడు లోకాల నన్నింటిని ధరించి వుండేది, సృష్టి స్థితి లయాలనే త్రికార్యములను నిర్వర్తించేది, నిత్యా అనే కళా స్వరూపిణిగా విలసిల్లుతున్నది..త్రిపుర సుందరి రూపిణీ అయిన లలితాదేవి.
బ్రహ్మాండ పురాణమున శ్రీవిష్ణు స్వరూపులైన హయగ్రీవులు లలితా దేవి యొక్క చరిత్రను అద్భుతముగా చెప్పి వున్నారు. శ్రీదేవి పుట్టుక, శ్రీపుర వర్ణన, శ్రీవిద్యా మంత్రముల విశిష్టత, అంతర్యాగ, బహిర్యాగ క్రమము, జప లక్షణము, హోమ ద్రవ్యములు, శ్రీచక్రము, శ్రీ విద్య, గురు శిష్యుల సంబంధము పలు స్తోత్రములు చెప్పివున్నారు.
లలితా దేవి యొక్క సహస్రనామములు వినడానికి నాకు యోగ్యత లేదా మరి ఎందువలన నాకు సెలవియ్యలేదు, అని ఎన్నో సంవత్సరముల నుంచి ప్రాధేయపడుచున్న తపోధనుడైన అగస్త్యుడిని చూచి
హయగ్రీవులు ఇలా అన్నారు..
లోపాముద్రకు పతివైన ఓ అగస్త్యా…
లలితా సహస్రనామములు అతి రహస్యాలు. (అంటే ఆషామాషిగా చెప్పబడేవి కావు), అతి శక్తిమంతమైనవి, భక్తిప్రపత్తులతో అడుగుతున్నందువలన నీకు ఉపదేశము చేస్తున్నాను.
ఇవి శఠునికి, దుష్టుడికి, విశ్వాసహీనుడికి ఎప్పుడూ చెప్పకూడదు. శ్రీ మాతృ భక్తిలో పూర్ణ భక్తి గల వారికి, శ్రీవిద్య ఎరిగిన వారికి, శ్రీ దేవీ ఉపాసకులకు మాత్రమే యీ సహస్రనామములు చెప్పవలెను.
మంత్రములలో శ్రీవిద్య ఎలా ముఖ్యమైనదో,
శ్రీవిద్యలలో ఎలా కాళీ విద్య ముఖ్యమో,
పురములలో శ్రీపురం ఎలా ప్రధానమైనదో,
శక్తులలో లలితాదేవి ఎలాగో,
శ్రీవిద్యోపాసకులలో పరమ శివుడు ఎలా గొప్పవాడో,
అలా సహస్రనామాలలో యీ లలితా సహస్రనామాలు బహు శ్రేష్టాలు.
ఈ నామాలు పఠించటం చేత శ్రీ లలితాదేవి బహు ప్రీతి నొందును.

శ్రీచక్ర రాజములో లలితా దేవిని బిల్వ దళాలతోగాని, పద్మాలతో గాని, తులసి పత్రములతో గాని, ఈ సహస్రానామాలతో ఎవడు పూజిస్తాడో అతడికి లలితా దేవి వెంటనే మేలు చేకూర్చును.
చక్రరాజమైన శ్రీచక్రమును పూజించి, పంచదశాక్షరీ మంత్రాన్ని జపించి, తరువాత ప్రతి దినము
ఈ సహస్రానామాలతో కీర్తించవలెను. జప పూజాదులు నిర్వర్తించలేనప్పుడు కనీసం సహస్రనామ పారాయణం చేయాలి. ప్రతిదినము నిత్యకర్మల మాదిరి యీ లలితా సహస్రనామములు చేయవలెను.
శ్రీలలితా దేవి ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు యీ లలితా సహస్రనామములను స్తోత్రము చేసిరి.

సకల రోగాలను పోగొట్టి..సకల సంపదలను..ఇచ్చేఈ స్తోత్రమునకు సమానమైన స్త్రోత్రము ఇంతవరకు లేదు. ఇది సమస్త అకాల మరణములను పోగొట్టి, అపమృత్యువుని దరి చేరనీయకుండా, సకల జ్వరాలను, రోగాలను శమింపజేసి, దీర్గాయుష్షును అందజేస్తుంది. పుత్ర భాగ్యం లేనివారికి పుత్రులను ఇస్తుంది.
ధర్మార్ధ కామ మోక్షాలనే నాలుగు పురుషార్ధములను చేకూరుస్తుంది. లలితాదేవి పూజాతత్పరులు ప్రతిదినం ప్రయత్న పూర్వకముగా శ్రీవిద్యా జపము చేసి, శ్రీచక్రార్చన చేసి, ఈ నామములను చదువ వలెను.
గంగ మొదలైన నదులలో కోటి జన్మలు స్నాన మాచరిస్తే ఏ ఫలం కలుగుతుందో,
కాశీ క్షేత్రంలో కోటి లింగాలను ప్రతిష్ట చేస్తే ఏ ఫలం కలుగుతుందో,
కురుక్షేత్రములో సూర్య గ్రహణ సమయంలో కోటిమార్లు దానాలు చేస్తే ఏ ఫలం దక్కుతుందో,
గంగా తీరంలో కోటి అశ్వమేధ యాగాలను చేస్తే ఏ ఫలం దక్కుతుందో..
అంతటి పుణ్యానికి కోటి రెట్లు అధిక పుణ్యము యీ సహస్ర నామాలలో ఒక్కటి పఠించినా కూడా లభిస్తుంది.

నిత్య కర్మలు చెయ్యకపోవటం చేత, నిషిద్ధ కర్మలు చెయ్యటం చేత కలిగే పాపాలు కూడా సమసిపోవటం నిశ్చయం. సమస్త పాపాలను పోగొట్టడంలో ఒక్క సహస్రానామానికి వుండే శక్తి ఎలాంటిది అంటే, ఈ పద్నాలుగు లోకాలలోని వారంతా కలిసి చేసే మొత్తం పాపాలు కూడా యీ సహస్రనామ శక్తికి తీసికట్టే. దాని శక్తికి మించినవి ఏ మాత్రం కావు. ప్రతి రోజు చేయక పోయినా.. పుణ్య దినములలో.. తన భార్య, తన బిడ్డల జన్మ నక్షత్రము వచ్చే రోజులలో, అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణమి, శుక్రవారములలో ముఖ్యముగా పఠించవలెను.
పౌర్ణమి నాడు చంద్రుడిలో లలితాదేవిని ధ్యానించి పంచోపచారముల చేత పూజ చేసి, సహస్ర నామములను పఠిస్తే సమస్త రోగములు పోయి, దీర్గాయుష్షు కలుగుతుంది. ఇది కామ్య ప్రయోగ విధి.
పిల్లలు లేని గొడ్రాలకి వెన్నను ఈ నామ పారాయణ చేత మంత్రించి ఇస్తే గ్రహ పీడలు తొలగి పుత్రులు కలుగుతారు.
ఈ సహస్ర నామ పారాయణుని పై ఎవరైనా అభిచారాది దుష్ట ప్రయోగములు చేస్తే, ప్రత్యంగిరా దేవి ఆ ప్రయోగములను తిరుగ గొట్టి, ఆ ప్రయోక్తలను సంహరిస్తుంది.

శ్రీదేవీ ఉపాసకులను..ఎవరైనా దూషించినా..నిందించినా..అనరాని మాటలు అనినా. .అగౌరవపరచినా..అవమానపరచినా..క్రూర దృష్టితో చూచినా..వాదించినా.. వాడి ధనమును దోచినా..
కృతఘ్నత చూపినా..వాడ్ని క్షేత్రపాలకుడు అయిన శివుడు చంపుతాడు. నకులేశ్వరి వాడి నాలుకను తెగకోయును.వాక్ స్థంభనము చేయును.

ఎవడు భక్తితో ఈ నామములను ఆరు నెలలు చేస్తాడో, అతడి యింట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును.
ఎవరు శ్రీవిద్యను ఉపాసన చేస్తారో..ఎవరు నిత్యం శ్రీచక్రాన్ని అర్చిస్తారో..ఎవరు యీ నామాలను కీర్తిస్తారో..
వారికి దానం ప్రయత్న పూర్వకముగా ఇవ్వవలెను. దానం చెయ్యాలను కొనేవారు, పరీక్షించి శ్రీవిద్య తెలిసిన వారికే దానం చెయ్యవలెను.
లోక వాక్యాలకంటే విష్ణు సంకీర్తనం ముఖ్యం. అలాటి విష్ణు సహస్ర నామముల కంటే గొప్పది ఒక్క శివ నామము. శివ సహస్ర నామాలకన్నా దేవీ నామం ఒక్కటి ఎంతో మహిమ గలది దేవీ సహస్ర నామాలలో పది విధాలైన సహస్ర నామములు ప్రధానమైనవి. అవి..
గంగ..భవాని..గాయత్రీ..కాళి..లక్ష్మి..సరస్వతి..రాజ రాజేశ్వరి..బాల..శ్యామల..లలిత..
వీటిలో లలితా సహస్ర నామములు అతి శ్రేష్ఠమైనవి.
అందు చేత కలి దోష నివారణ నిమిత్తం వీటిని నిత్యం పారాయణ విధిగా చేయవలెను..స్వస్తి..!!

శ్రీ మాత్రే నమః

సేకరణ

🌺🙏🙏🙏🙏🙏🌺

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s